Saturday, November 19, 2011

నా చరణం - మీ పల్లవి రెండవ సమావేశం


సరిగ్గా మూడు నెలల తరువాత హైదరాబాద్ నగరంలోనే మళ్ళీ "నా చరణం - మీ పల్లవి" రెండో సమావేశ౦ జరిగింది. ఈ సారి శ్రీమతి ఉమ దుర్గ ప్రసాద్ గారి గృహం వేదిక కావడం విశేషం!. 

ఈ సమావేశానికి హాజరైన "నా చరణం - మీ పల్లవి" సభ్యుల వివరాలు:

(1) డాక్టర్ అనురాధ గోడి గారు (ఫోటో తీయించుకున్న సమయంలో అనురాధ గారు  లేరు)
(2) శ్రీనివాస చారి గారు (కొత్త సభ్యత్వం, పూర్ణిమా సిరి గారి శ్రీవారు)
(3) వెంకట్ హేమద్రిభోట్ల గారు  (తన కుమార్తె చి. సౌ వసుధతో)
(4) వెంకట్ సోమశేఖర్ పేరూరి గారు  
(5) కళ్యాణ్ కోటంరాజు గారు  (తన శ్రీమతి ప్రవీణ, కుమారులు రాఘవేంద్ర కాశ్యప్ మరియు రమణ కార్తికేయలతో)
(6) ఉమ దుర్గా ప్రసాద్ గారు 
(7) సుధారాణి చల్లా గారు  (తన తల్లి గారైన శ్రీమతి సరోజిని గారితో)
(8) పూర్ణిమా సిరి గారు   (తన శ్రీవారు శ్రీనివాస చారి గారితో)
(9) సాయిబాల కోటంరాజు గారు 
(10) జ్యోతి వలబోజు గారు 
(11) ప్రభాకర్ రావు గారు  
(12) విజయ్ మహావాది గారు 
(13) చారి ముగల గారు  
(14) రోసీ గౌడ్ గారు  
(15) స్వరూప్ మంచికంటి గారు 
(16) శ్రీ వాత్సవి రాయపురెడ్డి గారు 
(17) సాయికమల మంచికంటి గారు 


దూరంనుండి వచ్చినా,  స్వరూప్ మంచికంటి తమ్ముడు (చెన్నాయి)  మరియు చారి ముగల గారు (ముంబాయి) వేదికకు అందరికంటే ముందుగానే చేరుకున్నారు. మరి సాయికమలకు టూ వీలర్ తో సిటీ అంతా చెక్కర్లు కొట్టే బాధ తప్పింది. ఎందుక౦టే వేదికగా మారిన ఉమ గారి గృహం సాయికమల పనిచేస్తున్న ఆఫీసుకు ఎంతో దూరంలో లేదు. పదిహేను నిమిషాలలో చేరుకోవచ్చును. ఆలస్యంగానైనా సాయికమల కూడ స్వరూప్ మరియు చారి గార్లతో పాటే ముందుగానే వేదిక దగ్గరకు చేరుకుంది.

ఆ తరువాత నుండి ఒక్కొక్కరుగా  వేదికకు చేరుకోవడం ప్రారంభమయింది. అందరికంటే చివరిగా వేదికను కళ్యాణ్ గారు తన కుటుంబ సభ్యులతో చేరుకున్నారు. రెండు గంటలకు ప్రారంభం కావలసిన సభ, రావలసిన సభ్యుల కోసం ఎడురుచూపులతో కొంత ఆలస్యంగా ప్రారంభమయింది. 

సభ ప్రారంభంయ్యేముందు ఏదో ఫార్మాలిటీ కోసం సాయి కమల ఫోన్ చేసి "సభ ప్రారంభిస్తున్నాం సార్!"  అని ఫోన్లో సమాచారం అందించి నన్ను ఆవేదనకు గురి చేసింది. నేపధ్యంలో కోలాహలం విని రెక్కలు కట్టుకుని వేదిక దగ్గర వాలాలనిపించింది. దేనికైనా అదృష్టం ఉండాలి అంటారు. ఈసారికి ఇంతే అని సర్ది చెప్పుకున్నాను.నన్ను సభ ప్రారంభ సందర్భంలో గుర్తు చేసుకున్నా సభ్యులందరికీ ధన్యవాదములు. రోసీ గౌడ్ తమ్ముడు ఎప్పటికప్పుడు సభలో జరుగుతున్నా విశేషాలను లైవ్ టెలికాస్ట్ చేసాడు.  అలానే విశాఖపట్నం నుండి రెండు బస్సులు మారి వేదికను చేరుకున్న సోమ శేఖర్ పేరూరి గారు కూడ ఫోన్లో మాట్లాడారు. సోమశేఖర్ గారు నేను మీట్లో కలుస్తానని అనుకున్నారు. సోమశేఖర్ గారు కొత్త మెంబర్ కావడం వలన వైజాగ్లో అతన్ని ఇంతవరకు నేను కలువలేదు.
అక్కడ నేను లేకపోవడం అతనికి నిరాశ కలిగించింది.



కార్తీక మాసం లో జరిగే  వనభోజనాలు నేపధ్యం తో ఈ రెండవ సమావేశం జరపాలని ముందు అనుకున్నా అనుకూలించని పరిస్థితులలో వేదికను శ్రీమతి ఉమా గారి గృహమునకు మార్చడం జరిగింది.

రెండవ సమావేశం ఆహ్వాన పత్రిక :


ఇక ఎస్సెమ్మెస్ రూపంలో అభినందనల పరంపర కూడ మీట్లో ఉన్న మెంబెర్స్ సెల్ ఫోన్లకు అందాయి. ముంబాయి నుండి ప్రియావేదంతం గారు, ఇంకా ఇతర చోట్ల నుండి శుభాకాంక్షల సమాచారం సాయికమల మొబైల్ ఫోన్ కి చేరాయి. నాది కూడా :(  అలానే మొదటి సమావేశంలో ఎంతో హుషారుగా పాల్గొన్న సాయి రమ్య భాను మరియు వందన ఆచంట కాలేజీలకు శెలవు లేని కారణ౦గా రాలేకపోయారు. అయినప్పటికీ ఫోన్ కాల్స్ ద్వారా మీటింగ్ స్థితి గతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మీట్లో ఉన్నవాళ్ళతో ఫోన్లో మాట్లాడి ఆనందించారు. 

ఇది జ్యోతి వలబోజు గారు వ్రాసి పంపిన సమీక్ష :
"నా చరణం - మీ పల్లవి",   తెలుగు సంగీతప్రియులను అలరిస్తున్న ఈ ఫేస్ బుక్ సోషల్ నెట్ వర్క్ గ్రూప్ వైవిధ్యంతో ముందుకు సాగుతూ ఒకే అభిరుచి ఉన్న మిత్రులను అనతి కాలంలోనే రెండోసారి తమ సంతోషాలను పంచుకోవడానికి మరోసారి వేదిక మీదకు ఆహ్వానించింది.

మధురమైన పాటలను గుర్తుచేసుకుంటూ, అనురాగాలు, ఆత్మీయతల బంధం వేసుకుని ఒక అందమైన అనుబంధాలను  ఏర్పరచిన అద్భుతమైన వేదిక. నిత్యజీవితంలోని ఒడిదుడుకులు, ఒత్తిడులను ఎదుర్కుంటూనే వృత్తి ప్రవృత్తి బాధ్యతలు నిర్వహిస్తూనే ఈ గుంపులో అందరూ ఎంతో చలాకీగా గడిపేస్తున్నారు. తమ పనిలో కలిగిన అలసటను పూర్తిగా మరచిపోతున్నారు. పాటలతో పాటు హస్య ఛలోక్తులు, పరామర్శలు, సంతోషాలను పంచుకోవడం. పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం నిత్యకృత్యమయింది. ఇదంతా ఆన్‌లైన్‌లో మాత్రమేనా అంటే కానే కాదు. రోజూ ఆన్‌లైన్‌లో కలిసినా ప్రత్యక్షంగా కలిసినప్పుడు కూడా అదే ఆత్మీయత, అనుబంధం, అల్లరి కనిపించాయి. కొత్తా, పాతా అన్న బేధాలు అస్సలు లేవు. ఒక కుటుంబ సభ్యులులా , పాత స్నేహితుల్లా , ఎప్పటినుండో తెలిసినవాళ్లే  అన్నట్టు కలిసిపోయారు నిన్నటి మీట్‌లో.

ముందుగా ఈ మీట్ ని సమర్ధవంతంగా నిర్వహించిన ఉమకి ఆమెకు సాయం చేసిన సిరి, సాయి కమలకు ధన్యవాదాలు చెప్పుకోవలసిందే!...

అందరినీ పర్సనల్‌గా ఇన్వైట్ చేస్తూ, తప్పకుండా రావలసిందే అని ప్రేమతో బలవంతం చేసారు. అందుకేనేమో చెన్నై నుండి స్వరూప్, ముంబై నుండి చారి, వైజాగ్ నుండి వెంకట సోమశేఖర్, సిటీలో ఉన్నా ఎంతో దూరంగా ఉన్నా, అందరినీ కలవాలన్న ఉత్సాహంతో కుటుంబాలతో సహా వచ్చారు మిత్రులు.

ఈ మీట్ సంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలణతో మొదలైంది. విజయ్ మహావాది చెప్పిన మంత్రపుష్పం, వినాయక ప్రార్ధన ఈ సమావేశానికి వన్నె తెచ్చింది.

ఆట - పాట:


ఈ ప్రోగ్రాం కోసం ఉమ, కమల కొన్ని గేమ్స్ తయారు చేసి ఉంచారు.
అందరికీ నంబర్లతో చేసిన చిట్టీలు ఇచ్చి, నలుగురి చొప్పున గ్రూపులుగా చేసారు. అంతకుముందే మన గ్రూపు పేరుకు తగ్గట్టుగానే వేర్వేరు పాటలతో చరణాల ఆడియో తయారు చేసి ఒక్కో గ్రూపుకు ఒక్కో చరణం ఇచ్చి పల్లవి అడిగింది ఉమ. ఆ చరణాన్ని జాగ్రత్తగా విని దాని  పల్లవి చెప్పాలి. దీనికి వేరే గ్రూపు వాళ్లు సాయం చేస్తే మైనస్ మార్కులు ఉన్నాయి. క్లూలు అడగొచ్చు. దానికి ఒక్కో మార్కు తగ్గుతుంది. ఆ పాట చెప్పలేకుంటే తర్వాతి గ్రూపుకు పాస్ అవుతుందన్నమాట.

ముందుగా అందరికీ రెండు రకాల స్వీట్లు, మిక్స్చర్, కాజాలు ప్లేట్లతో అందరికీ ఇచ్చారు. నీళ్ల బాటిళ్లు మర్చిపోలేదు.. అవి తింటూనే  పాటల పోటీ జరిగిందన్నమాట.  ఈ సభ్యుల ఆటలతో కరెంట్ కూడా నేనేం తక్కువ తిన్నానా అంటూ ఆటలాడింది. ఐనా మన ఉత్సాహం తగ్గుతుందా. ఈ పవర్ కట్ లకు  కూడా ఉమ రెడీగా ఉంది. పవర్ పోయినప్పుడల్లా ఉమ, సిరి కలిసి చరణాలను పాడేవారు.  ఇలా నాలుగైదు రౌండ్లు జరిగాయి. తర్వాత గ్రూపులో మనం అప్పుడప్పుడు ఆడుకునే చిత్రాల రౌండ్.  చరణాలను వేర్వేరు బొమ్మలతో కలిపి తయారు చేసే చిత్రాలనే కొన్నింటిని తయారు చేసి ఒక్కో గ్రూపుకు ఒక్కో చిత్రం  ఇవ్వబడింది. చాలా మంచి పాటలను ఎన్నుకుని చిత్రాలను చేసారు . కొన్ని అర్ధం కాలేదు కాని క్లూలు ఇవ్వగానే టక్కున పట్టేసేవారు పల్లవిని.

పూర్ణిమ సిరి గారు తీసుకువచ్చిన రవ్వ లడ్డూలు:

స్నాక్స్ అయ్యక కూల్ డ్రింక్స్ కూడా అందాయి అందరికీ.. ఇక్కడ మరో విషయం చెప్పాలి. గర్భిణి ఐన పూర్ణిమ సిరి తన శ్రీవారైన శ్రీనివాస చారి గారితో కలసి ఊరికి అటువైపు దిల్‌షుక్‌నగర్ నుండి ఊరికి ఇటువైపు నిజాంపేట్ కు శ్రమ అని అనుకోకుండా వచ్చారు. వస్తూ వస్తూ తను ఇంట్లో చేసిన రవ్వలడ్డూలు తీసుకువచ్చింది. అలాగే వెంకట్ కుమార్తె చి. సౌ. వసుధ చాల ఏక్టివ్ గా అటూ ఇటూ తిరుగుతూ సభ్యుల ఫోటోలను తీసింది. చివర్లో  మహేష్ బాబు "దూకుడు" చిత్రం నుండి ఒక పాట పాడింది.

హైదరాబాదు సిటీలో ఎంత ట్రాఫిక్ జామ్ లు  ఉన్నా ఈ మీట్ కి చేరుకోవాలి అని కొద్దిగా వెనకా ముందూ అందరూ వచ్చారు. కల్యాణ్, తన భార్య పిల్లలతో కాస్త ఆలస్యంగానే వచ్చాడు. కుకట్‌పల్లి లో ట్రాఫిక్ జామ్ లో అరగంట ఇరుక్కుపోయాడంట. అతను రాగానే అందరూ హో అని గట్టిగా అరిచేసారు. అలాగే మధ్య మధ్యలో రానివాళ్లు కాల్ చేసి ఇలాగే అందరూ గట్టిగా హాయ్ చెప్పారు. అలాగే మీట్ మొదలుపెట్టేముందు RK గారికి కాల్ చేసి అందరూ  హాయ్ చెప్పారు. ఈ మీట్ కి రావాలని రాలేకపోయిన జగతి, వందన, రామకృష్ణ మోటపర్తి, MSRK ఫోన్ చేసి మాట్లాడి, కొంచెం అసూయ పడ్డా ఇక్కడి గోల విని  తృప్తి పడ్డారు తమ బాధను కొంత తగ్గించుకున్నారు. రెండు రౌండ్లు అయ్యాక కేక్ కటింగ్ జరిగింది.  అక్కడ ఉన్నవారిలో  అందరికంటే చిన్నవాడైన కల్యాణ్ చిన్న కొడుకు రమణ కార్తికేయ, అలానే అందరికంటే పెద్దవారైన కల్యాణ్ తల్లి గారైన సాయిబాల గారు కలిసి కేట్ కట్ చేయడం అందరిని ఆనందపరచింది.

స్వరూప్ మంచికంటి ఎంతో ఇష్టపడి సెలెక్ట్ చేసి తీసుకువచ్చిన కేక్ ఇది. చూస్తుంటే తినకుండా 
దాచుకోవాలన్నట్లుంది. 

కేక్ తినడమయ్యాక   తర్వాత మరో రెండు రౌండ్ల పాటల ఆటలు జరిగాయి. చివర్లో డా.అనూరాధగారు వచ్చారు. మంచికంటి శ్రీనివాస రామకృష్ణ గారు మీట్ కు ఎటేండ్ కాకపోయినా అభిమాన౦తో సభ్యుల కోసం విజయవాడ నుండి యుటిలిటీ బాక్సులు కానుకలుగా అందజేశారు. అలాగే ముంబాయ్ నుండి సమావేశంకు హాజరైన చారి గారు పెన్నులను సభ్యులకు కానుకగా అందజేశారు.
*********
రెండో సమావేశం బేనర్:


వేదికపై ముస్తాబైన బేనర్


మరికొన్ని విశేషాలు:


"శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి ద్రుతి నీవు ద్యుతి నీవు శరణా గతి నీవు భారతి"
అని కలసి పాడుతున్న సాయికమల గారు , ఉమ గారు మరియు శ్రీ గారు.


సభ ప్రారంభం అనంతరం  విజయ్ మహావాది గారు ఓ రెండు పాటలు పాడారు. అవి ఒకటి హిందీ సాంగ్ "మేరే నైనా...సావన్ భాదో ఫిర్ భీ మేరా మాన్ ప్యాసా ....ఫిర్ భీ మేరా మాన్ ప్యాసా ...." అన్న కిశోర్ కుమార్ పాట మరియు శ్రీమతి ఇందిరా గాంధీ పురస్కరించుకుని "ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి... ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి" అన్న ఘంటసాల పాట. అభినందనలు విజయ్ మహావాది గారు.  


"సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వలపంటె నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే" అంటూ రాగయుక్తంగా చిత్రం పంతులమ్మలో పాటను గానం చేస్తున్న వెంకట్ హేమద్రిభోట్ల గారు, కళ్యాణ్ కోటంరాజు గారు మరియు వెంకట్ సోమశేఖర్ పేరూరి గారు. మంచి పాట. 

సభ పూర్తయ్యాక  అందరూ కలసి "ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము...NCMP పాటల తోటలో..చరణాలతో పల్లవులతో పాడుకొ౦టున్నాము...ఈ బిజీ బిజీ జీవనగాహినిలో... వియ్ హేవ్ ఆల్ ది ఫన్...వియ్ హేవ్ ఆల్ ది  జాయ్...వియ్ ఎంజాయ్... " అని మూకుమ్మడిగా పాడుకున్నారు. ఇంకా సమావేశానికి హాజరైన సభ్యులందరూ తమ తమ స్పందనను ఓ చార్ట్ మీద వ్రాసి సంతకం కూడా చేసారు. సంతకాలు చేసిన ఆ చార్ట్ ని వెంకట్ సోమశేఖర్ పేరూరి గారికి అందజేశారు. వారి దగ్గర తీసుకుని స్కేన్ చేసిన స్పందనలు త్వరలోనే 
బ్లాగ్ కి అఫ్ లోడ్ చేస్తాను. చివరిగా సాయికమల ఫోన్ చేసి మీటింగ్ ముగిసిన విషయం తెలియజేసి అందరితో గట్టిగా "హాయ్ - బాయ్" చెప్పించింది. ఆ తరువాతనే పెండింగ్ లో పడి ఉన్న నా దినచర్యలు ప్రారంభమయ్యాయి. 

కొన్ని ఫోటోలు:


సుధారాణి తల్లీ మరియు రచయిత్రి శ్రీమతి సరోజినీ గారు, పూర్ణిమ సిరి గారు మరియు జ్యోతి వలబోజు గారు. జ్యోతి ప్రజ్వలన జరుగుతున్నప్పటి ఫోటో అనుకుంటా 



అల్పాహార విందు..దూరంగా ఫోటోలు తీస్తున్నది ఉమా గారి సోదరుడు గౌతమ్ గారు. విసుగులేకుండా ప్రారంభం నుండి చివరివరకు ఈ సమావేశ౦లో ముఖ్య విషయాలను రికార్డ్ చేస్తూ ఎంతో సహకరించారు.


వాత్సవి గారు మరియు ఉమ గారు. వాత్సవి  గారి పాటల పుస్తకాలనుండి పాడేందుకు పాటలను సెలెక్ట్ చేస్తున్నట్లున్నారు.



ప్రభాకర్ గారు పాటల పుస్తకంలో పాటలు చూస్తున్నట్లున్నారు


ఉమ గారి దగ్గర్నుండి రావలసిన ఫోటోలు మరియు వీడియోస్  ఇంకా చాల ఉన్నాయి. రేపటి నుండి కొత్త అఫ్ డేట్స్ ఉంటాయి. వేచి చూడగలరు. 

రెండవ సమావేశం పై సభ్యుల స్పందనలు :

  


ఉమ దుర్గ ప్రసాద్ గారి స్పందన:

ముందుగా ఈ సమావేశం మా ఇంట్లో జరగడానికి ఒప్పుకుని ఎప్పటికప్పుడు మేము అడగగానే ఏ మాత్రం విసుగులేకుండా వారి సలహాలను మాకు ఇచ్చి , సందర్భానుసారంగా వారి సహాయాన్ని అందించి వారు రాలేకపోయినా ఈ సమావేశాన్ని విజయవంతంగా జరిపించిన మరియు జరుపుటకు కారకులైన గౌరవనీయులు శ్రీ రామకృష్ణ పుక్కళ్ళ గారికి NCMP సభ్యులందరి తరుపున మరియు రెండవ సమావేశానికి హాజరైన సభ్యులందరి తరుపున కృతజ్ఞతలు తెలుపుతూ వారికి మనః పూర్వక ధన్యవాదములు .

సమావేశం జరపాలనే ప్రతిపాదన చేసి , నా వెనక ఉండి అంతా సక్రమంగా జరిపించడానికి తన సమయాన్ని కేటాయించి , పూర్తి సహకారాన్ని అందించిన కమలక్కకు, మార్గదర్శకులుగా నిలిచినా కళ్యాణ్ అన్నయ్యకు ప్రత్యెక కృతజ్ఞతలు .

మొదట్లో కుదరదు అని చెప్పినా చివరలో వచ్చి సమావేశాన్ని విజయవంతం చేసిన వారందరికి కృతజ్ఞతలు . నా ఆహ్వానాన్ని మన్నించి , మీ పనులను మానుకుని , ట్రాఫిక్  తలనొప్పిని కూడా లెక్కచేయక మా ఇంటివరకు వచ్చి మాతో సమానంగా ఆనందించిన సభ్యులందరికీ ధన్యవాదములు .

చిన్న పెద్ద తేడా లేకుండా మేము పెట్టిన పాటల మరియు చరణాలకు సంబందించిన మూడు రౌండ్ లలో పాల్గొని , మా చిరు ఆతిధ్యమును స్వీకరించి మమ్మల్ని ప్రోత్సహించిన సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞాతాభివందనములు .